Tuesday 19 June 2012

స్వగతం – స్వపరిచయం

స్వగతం – స్వపరిచయం
సభకు నమస్కారములు.
గురువులకు, విబుధ జనులకు, పండితోత్తములకు, జ్ఞానులకు, జిజ్ఞాసులకు, ఆర్తులకు, ఆచార్యులకు, తత్వవేత్తలకు, కోవిదులకు, వేద బ్రాహ్మణులకు, బ్రాహ్మణోత్తములకు, పెద్దలకు, పిన్నలకు, మిత్రులకు, సన్నిహితులకు, శ్రేయోభిలాషులకు, నమస్కారములు . ఇటువంటి బ్రహ్మ జ్ఞాన సంపన్నులతో నిండివున్న ఈ తెలుగు బ్రాహ్మణ సమాజమునకు నా ప్రణామములు. ఇటువంటి సమాజములో  మీ వంటి పెద్దల సరసన, నా బోటి వాణికి  కూర్చోవడానికి స్థానమిచ్చిన మీ దొడ్డ మనసునకు అంజలి ఘటిస్తున్నాను. ఈ సమాజములోనికి నన్ను ప్రత్యేకముగా, ప్రేమగా ఆహ్వానించిన శ్రీ రాజశేఖరుని విజయ శర్మ గారికి నా ప్రత్యేక శుభాభినందనములు.  ఇక నా గురించి సవివరముగా మీకు తెలుపుకొంటున్నాను.

చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు
ఆంగీరస, భారహస్పత్య, భారద్వాజస త్రయా ఋషయ
ప్రవరాన్విత భారద్వాజస గోత్రః, ఆపస్తంభ సూత్రః,
యజుశ్శాఖాధ్యాయీ, రామచంద్ర శర్మా౦ అహంభో అభివాదయే.

మా ఇంటి పేరు కామరాజుగడ్డ, ఇదొక చిన్న కుగ్రామము, రేపల్లె తాలూకా, గుంటూరు జిల్లా.  ఇది ఒక చిన్న దీవి. వరదలు వచ్చి మాటిమాటికీ వూరు కొట్టుకొని పోతూ వుండడమువలన, మా తాత, ముత్తాతలు కట్టు బట్టలతో నెల్లూరు వచ్చి, పప్పులవీధిలో (పెద్ద బజారు) స్థలము కొనుక్కొని స్థిర బడినారు 150 ఏళ్ళ క్రిందట. మా తాత గారు కామరాజుగడ్డ శ్రీనివాసరావుగారు, గొప్ప రంగస్థల నటుడు, ఆయుర్వేద వైద్యుడు. మా నాన్నగారు కామరాజుగడ్డ సుబ్బారావు గారు ప్రభుత్వ ఖజానాధికారిగా  పని చేసి రిటైర్డ్ అయినారు. ఇప్పుడు మా స్వంత వూరు నెల్లూరు.
నేను కామరాజుగడ్డ రామచంద్రరావును, భారద్వాజస గోత్రీకుడను, ఆరువేల నియోగి బ్రాహ్మణుడను. మేము స్మార్తులము. మేము ముగ్గురు అన్నదమ్ములము.  నా వయస్సు 52 సం. (24-10-1960).                   మూలా నక్షత్ర  యుక్త నాగుల చవతి నాడు, కార్తీక మాసములో  నేను జన్మించినాను నెల్లూరు లో.
 Electronics ఇంజనీరింగ్ లో BE   మరియు Electrical ఇంజనీరింగ్ లో FIE, రెండు ఇంజనీరింగ్ డిగ్రీలలో పట్టబధ్రుడనై, MBA చదివి దేశ, విదేశాలు తిరిగి చివరికి శ్రీకాళహస్తికి వచ్చి, LANCO INDUSTRIES లో GENERAL MANAGER గా ప్రస్తుతము పని చేస్తున్నవాడను.
నా భార్య పేరు సరస్వతి, ఇద్దరమూ శ్రీవిద్యోపాసకులము, పూర్ణ దీక్షాపరులము. మాకు ఇద్దరు పిల్లలు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, ఇంకా వివాహము కాలేదు. ప్రయత్నములు చేస్తున్నాము. పిల్ల లిద్దరికీ శ్రీ విద్యోపాసనా దీక్ష ఇప్పించినాము. చక్కగా నలుగురము ఆ పర దేవతను మంత్ర పూర్వకముగా కోలుచుకొంటున్నాము.    1982  లో నాకు మా శ్రీమతి తో వివాహము అయినది.  1982 లో నా జాతకము గురించి తెలుసుకొనే దానికి, నెల్లూరు లోని ప్రఖ్యాత జ్యోతిష పండితులు, శ్రీవిద్యోపాసకులు, సంస్కృత పండితులు అయిన శ్రీ కొట్రా వెంకట శేషయ్య శాస్త్రి గారి దగ్గరకు వెళ్ళినాను. వారు నాకు జాతకము చెప్పకుండా నన్ను ఆరు నెలలు తిప్పించుకొని, ఆపైన నాకు శ్రీవిద్యా మంత్రములైన బాల, నవాక్షరి, బగళ మంత్రములు ఇచ్చి నన్ను ఆశీర్వదించి పంపినారు.  అజ్ఞానాంధకారంలో కొట్టుకొని పోవుచున్న నాకు శ్రీవిద్యను అనుగ్రహించి, ఉపదేశించి వెలుగును చూపిన మహనీయులు  వారు. శ్రీవిద్య, శ్రీమాత అంటే ఏమిటో తెలియని నాకు జ్ఞాన బిక్ష పెట్టిన మహా మనిషి                శ్రీ కొట్రా వెంకటశేషయ్య శాస్త్రి గారు.

అదే మొదలు నేను శ్రీ విద్యలోకి అడుగు పెట్టడము. నా తొలి గురువు వారె. ఆ పైన నేను శ్రీ విద్యోపాసన చేస్తూ, నవరాత్రులు ఆ తల్లిని తొమ్మిది రోజులు శ్రద్దగా పూజిస్తూ వస్తున్నవాడను. ఆరు సంవత్సరాల తరువాత మా గురువు గారు పరమ పదించినారు. గురువు లేని వాణ్ణి అయినాను, దిక్కు లేదు, దారి చూపే వాడు లేడు. గమ్యం అర్ధము కాలేదు. తల్లి కాళ్ళు పట్టుకొని ఎడ్చినాను మరలా గురువును చూపించమని, ఎన్నో రాత్రుళ్ళు నిద్ర లేకుండా వగచాను. 12 ఏళ్లు  గురువు గారు లేకుండా, తండ్రి లేని పిల్లవాణ్ణిగా, లలితా సహస్రనామములతో కాగితపు  శ్రీ చక్రము మీద పూజ చేస్తూ, 12 నవరాత్రుళ్ళు పూర్తి చేసినాను. నవరాత్రి పూజా మహిమ వృద్దా పోలేదు, ఆ తల్లి నన్ను కరుణించినది.  2000 సం. లో తెనాలి వాస్తవ్యులు బ్రహ్మశ్రీ వేమూరి లక్ష్మీనారాయణ  గారు నా శ్రద్దను, భక్తిని చూచి నాకు ఒకే సారి పంచదశి, షోడశి, మహా పాదుకలతో పూర్ణ దీక్ష  ఇచ్చి నాకు గురు స్థానము కల్పించినారు. మా గురువులు నాకు ఇచ్చిన దీక్షా నామము భాస్కరానంద నాధ.   

 ఆ పైన వారు నాకు మహా విద్యను(500 మంత్రములు) కూడా ఉపదేశించినారు.  వారి దగ్గర మంత్ర, తంత్ర, యంత్ర  శాస్త్రములను,  శ్రీ చక్రార్చన మొదలగునవి నేర్చుకొన్నాను. అటు పిమ్మట ఎన్నో తంత్ర, మంత్ర గ్రంధములను కాశీ (చౌకాంబా సెంటరు) నుంచి తెప్పించి,  పరిశోధించి, సాధన చేసి ఎన్నో విషయములను తెలుసుకొన్నాను. ఎన్నో మంత్రములను స్వయముగా సిద్ది పొంది, తద్దేవతల అనుగ్రహము పొందినవాడను. ప్రస్తుతము దశ మహా విద్యలను ఉపాసన చేస్తున్న వాడను.     ఇప్పటి వరకు వృత్తిలో గాని, ప్రవృత్తిలో గాని ధనాపేక్ష లేకుండా, పై సంపాదన లేకుండా, న్యాయముగా, ధర్మముగా అమ్మ ఇచ్చిన జీతము డబ్బులతోనే బ్రతుకుతున్న వాడను. 
నేను చాలా బీద కుటుంబము లోనుంచి, కష్టముల లోనుంచి  వచ్చిన వాడను. నన్ను ఇంతటి పై స్థాయికి చేర్చి అర్హత ఇచ్చి, అందలం ఎక్కించినది మా అమ్మ  శ్రీ కామాక్షి నే. ఆ తల్లే లేకుంటే నేను ఈ రామచంద్రరావు లేడు, నాకు ఈ గుర్తింపు అంతా ఆమె వలెనే వచ్చినది. ఉద్యోగము లేకుండా, డబ్బులు లేకుండా దరిద్రము అనుభవిస్తున్న రోజులలలో, అమ్మకు నైవేద్యము పెట్టడానికి కూడా చేతిలో డబ్బులు లేకుండా వున్న రోజులలో, మా నాన్న గారు ఇచ్చే డబ్బులతో ఇల్లు గడుస్తూ వుండేది (నాకు ఉద్యోగము రాక మునుపే వివాహము అయినది), అభిషేకానికి పాలు లేవు, నా కన్నీళ్ళతోనే శ్రీ చక్రానికి అభిషేకము చేశాను. అంతటి దుర్బరమైన జీవితాన్ని నేను అనుభవించి నాను. కష్టాలు నాకు క్రొత్త గావు. అప్పుడు  ఏడుస్తూ 40 రోజులు కనకధారాస్తవము, చండీ హృదయము  చదివినాను, అంతే చివరి రోజు టెలిగ్రాం వచ్చినది (Appointment Order), అంతే అది మొదలు ఇక వెనకకు తిరగ లేదు, నా జైత్ర యాత్ర సాగుతూనేవున్నది ఇప్పటి దాక. ఎప్పడూ విమానము దగ్గరగా చూడని వానికి, నన్ను సింగపూరు లాంటి దేశాలకు విమానములో పంపి అమ్మ తన ప్రేమను చాటు కొన్నది. మిద్దెలు,మేడలు, కార్లు, హోదా  అన్నీ ఇచ్చినది. అన్నింటినీ న్యాయముగానే సంపాదించినాను. ఒక్క రూపాయ అక్రమముగా తీసుకోలేదు ఇప్పటి వరకు. ఇదంతా ఆ శ్రీచక్ర మహిమ. నాకు ఒకటే ధ్యేయం మా గురువు గారు శెలవిచ్చినట్లు శ్రీ విద్యా వ్యాప్తి చేయ వలెను. ప్రతి ఫలాఫేక్ష లేకుండా కష్టములలో వున్న వారిని ఆదుకోవలెను. 
గత 30 ఏళ్ల నుంచి శ్రీవిద్యోపాసన, శ్రీచక్రార్చన చేస్తూ వస్తున్న వాడను. మా గురు దేవుళ్ళు ఇచ్చిన 6 అంగుళముల మేరువు (శ్రీచక్రము) రూపములో ఆ పర దేవత మా శ్రీ పీఠంలో  కొలువై వున్నది. సతీ సమేతముగా నిత్యమూ మూల మంత్రములతో, చండీ, వన దుర్గా పారాయణములతో, అర్చనలతో మా శ్రీచక్ర నిలయము శోభాయమానంగా, సుఖ సంతోషాలతో విరాజిల్లుతూ వున్నది. మా గురు దేవుళ్ళు నా పట్ల చూపిన అపార మైన కృపా కటాక్షముల వల్ల, ఆ తల్లి యొక్క అనుగ్రహము వలన నేను ఇంతటి వాడిని అయినాను. ఇది అంతా ఆమెకు చెందినదే, నా దేమీ లేదు ఇందులో. అక్షర ముక్కరాని వానికి ఇంతటి జ్ఞానము ఇచ్చిన ఆ తల్లికి నేను ఏమి ఇచ్చి నా ఋణము తీర్చుకోగలను?
నాకు మంత్ర, తంత్రములతో బాటు జ్యోతిష్యం లోనూ, ఆయుర్వేదము లోనూ ప్రవేశము గలదు. ఈ విద్య కూడా అమ్మే(శ్రీమాత) నాకు ఇప్పించినది. నా గొప్పతనము ఏమీ లేదు.
శ్రీ శృంగేరీ శ్రీ విరూపాక్ష శ్రీ పీఠాధీశ్వర
శ్రీవిద్యాశంకర పదమావేశ ప్రకాశిత
శ్రీ జగద్గురు శ్రీ శ్రీ శ్రీ కల్యాణానంద భారతీ మహాస్వామి (శ్రీ విద్యారణ్యుల వారి అవిచ్చిన్న గురుపరంపరలో 42వ జగద్గురు) వారు మా పరమేష్టి  గురువులు.
కావున నేను శ్రీ శృంగేరీ శంకరాచార్య సాంప్రదాయములోని వాడను. నమ్మినవాడను. ఆ పరంపరలో దీక్ష తీసుకున్నవాడను నేను.   స్మార్తులము మేము. సకల దేవతారాధనే మా మతము. శివునికి విష్ణువుకి అభేదము అని గాఢముగా, ధృఢముగా నమ్మే వాళ్ళము మేము.

జగద్గురువులు శ్రీ శంకరాచార్య భగవత్పాదులు మా గురువరేణ్యులు. ఆదిగురువులు. వారి మాటలు నాకు శిరోధార్యము. వారి మాటలను, వారి సిద్దాంతములను, వారి అడుగుజాడలలో నడవడము నా ప్రధమ కర్తవ్యము అయివున్నది.
నాకు తెలిసిన, నేర్చుకున్న విషయములను పదిమందితో పంచుకోవాలన్న సత్ సంకల్పముతో ముందుకు సాగుతున్నాను. శ్రీవిద్యావ్యాప్తి కొరకు నా వంతు సహాయమును చేస్తున్నాను. జగములకు తల్లి అయిన ఆ శ్రీమాతను గురించి నాలుగు మాటలు చెబుతున్నాను. ఇష్టము వున్నవాళ్ళు స్వీకరించ వచ్చును, ఇష్టము లేని వాళ్ళు త్రుణీకరించనూ వచ్చును. ఎవరి అభిమతము వారిది. 

తెలిసినది కొంతే, తెలియనిది చాలా వున్నది, అందుకే ఆ శ్రీమాత నన్ను మీ చెంతకు చేర్చినది మీ దగ్గర విషయాలు తెలుసుకోవడానికి.  
నా లాంటి అర్బకుడ్ని మీ రందరూ దయతలచి, మీ సరసన కూర్చోవడానికి స్థానమిచ్చిన మీ లాంటి పెద్దలందరికీ నేను పాదాభివందనం చేస్తూ శెలవు తీసుకొంటున్నాను. ఓం శాంతి: శాంతి: శాంతి:.
మీ
భాస్కరానంద నాథ
మహావిద్యోపాసకులు, మహాపాదుకాంత శ్రీవిద్యాపూర్ణ దీక్షాపరులు
(కామరాజుగడ్డ రామచంద్రరావు )
11-6-2012.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.