Tuesday 9 October 2012

శ్రీదేవీ తత్వం - 3 (SRI DEVI TATWAM -3)


శ్రీదేవీ తత్వం - 3  (SRI DEVI TATWAM -3)

మీరు శ్రద్దగా ఒకటికి రెండు సార్లు చదివితే గాని పట్టుకోలేరు ఈ మూల రహస్యాన్ని. కొంచెము మనసు పెట్టి చదవండి, లేక పోతే మనస్సుకు అందదు. 

0, 1, 2, 3, 4,..100, 500, …..1000000,………..….

ఇలా మనము ఎన్ని అంకెలు వ్రాసుకొంటూ పోయినా, ఆ అన్ని అంకెలు కూడా ఆ సున్నా లో నుంచి వచ్చినవే అని తెలుసుకొనవలెను. అది సున్నా అని మనము అంటాము, నిజానికి అది సున్న(zero) కాదు,  అది శూన్యము గాదు. అది పూర్ణము, అనంతము (Infinite).  అందులో నుంచే అన్ని సంఖ్యలు వచ్చినవి. అలాగే తెలుపు రంగులో నుంచే అన్ని రంగులు వచ్చినవి అని కూడా తెలుసుకోవలెను. మరి ఆ తెలుపు, ఏమిటి? ఆ తెలుపు శుద్ధ తత్వం, అదే పరబ్రహ్మ స్వరూపం. అందుకే ఆ మహా శివుడ్ని

శుద్ధ స్పటిక సంకాశం, సచ్చిదానంద రూపం అని అంటారు. ఎలా తెలుపు లో నుంచి అన్ని రంగులు వెలసినవో, ఎలా పూర్ణము లో నుంచి అంకెలు వచ్చినవో అలాగే మొత్తం సృష్టి అంతా ఆ పరమశివుణ్ణి నుంచే వచ్చినవి. ఆ పూర్ణ బింబము మహా మాయతో కూడి వున్నది. ఆ మహా గర్బము నుంచే మన మందరమూ పుట్టినాము. అందుకే ఆమె ఆద్య కుటుంభిని అయినది.

అలా పూర్ణము లో నుంచి అంకెలు రావడానికి, తెలుపులో నుంచి మిగతా రంగులు రావడానికి కారణం పరబ్రహ్మ మహిషి అయిన ఆ జగన్మాతే కారణము. రంగులు అంటేనే సృష్టి, మాయ. రంగులు లేకపోతే సృష్టి లేదు. మహా ప్రళయంలో సృష్టి అంతా ఒక దానిలోకి ఒకటి వెనక్కి వెళ్లి పోతుంది (Retrieve). అప్పుడు అన్ని రంగులు కలసి, (అన్ని జీవరాసులు, ప్రాణి కోటి కలసి) ఒకే ఒక రంగు తెలుపు మహా మాయ అవుతుంది, ఆ మహా మాయ కూడా ఆ పరబ్రహ్మంలో కలిసి పోయి మహా బింబం ఏర్పడి శుద్ధ తత్వం (కర్పూర గౌరం), మహా తెలుపు, మహా గౌరం ఏర్పడుతుంది.  అదే ఆ పరమ శివ శంకరుని తత్వం. ఇదే నిర్గుణ తత్వం.

 
కర్పూర గౌరం కరుణావతారం,సంసార తారం భుజగేంద్ర హారం
సదా వసంతం హృదయార వింద౦, భవం భవానీ సహితం నమామి. 
ఆ తల్లిశంకరార్దాంగ సౌందర్య శరీరాయై నమః.”.  విడరాని బంధము వాల్లిద్దరిది.

అదే కామ కామేశ్వరీ తత్వం. వాళ్ళే మనకు అసలు సిసలు అయిన జననీ జనకులు. తక్కిన వాళ్ళు అందరూ ఆ తరువాతనే. ఆ శక్తిలో నుంచి పుట్టుకు వచ్చిన వాళ్ళే.

మూల ప్రకృతి యొక్క లక్షణములు:-

“ప్ర” యన ప్రకృష్ట వాచకము, కృతి శబ్దము సృష్టి వాచకము. కనుక విశ్వమును నిర్మించుట యందు శ్రేష్టురాలయగు దేవతను మహా ప్రకృతి అని అందురు. ప్ర శబ్దము సత్వగుణమును,

“కృ” శబ్దము రజోగుణము, “తి” శబ్దము తమోగుణమును తెలుపును. చిన్మయ బ్రహ్మము త్రిగుణముల మాయతో కూడి సృష్టి కార్యము సాగించునపుడు దానిని ప్రకృతి అని, శక్తి యుక్తమని అందురు.  

సృష్టికి పూర్వము వున్న స్థితిని “ప్ర”  అని, సృష్టికి తరువాత దానిని “కృతి” అని అందురు. కనుక ఈ సృష్టికి పూర్వమందున్న దేదీప్యమానమగు చైతన్య మహాదేవియే మూల ప్రకృతి అని అందురు. ఆ నిరంజనమగు సత్యజ్ఞానానంతమగు పరమాత్మ సృష్టి జరుగునప్పుడు తన యోగ మాయతో రెండు రూపములు దాల్చును. అతని కుడి భాగము పురుషుడనియు, ఎడమ భాగము ప్రకృతి యని అందురు. అగ్నిలో వున్న దహన శక్తి వలె ఆత్మ లోపల, పరమాత్మ లోపల ఈ ప్రకృతి శక్తి గలదు. అందుకే యోగీంద్రులకు, జ్ఞానులకు స్త్రీ, పురుష భేదము కనిపించదు. ఈ విశ్వమున ప్రకృతి పురుషాత్మకము గాని వస్తువు లేదు.

శరణార్ధుల దీనార్తులు తొలగించి వారిని బ్రోచుటయే పనిగా గలది, తేజోరూపిణి, అగ్ని వర్ణ తపమున వేల్గొందునది, కృష్ణుని హృదయాదిష్టాతృదేవి దుర్గా దేవి సర్వ శక్తి స్వరూపిణి, పరమేశ్వరుని పరాశక్తి. అష్ట సిద్దులకీశ్వరి అయిన ఈ మహాదేవి సకల జీవుల యొక్క బుద్ది, భ్రమ ఓర్పు నిద్ర ఆకలి దప్పులు నీడలు ఏమరపాటు దయ తలంపు జాతి శాంతి కాంతి చైతన్యము తుష్టి పుష్టి లక్ష్మి ధైర్యము మాయ మున్నగువన్నియు ఈ మహా శక్తివియే.

ఈ దుర్గా దేవియే శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క స్వరూప శక్తి. 

చండీ నవాక్షరీ మహా మంత్రమునకు ఋషి,  ద్రష్ట  శ్రీమహా విష్ణువే. 

ఈ మూల ప్రకృతి యైదు శక్తి మూర్తులుగా నావిర్భవించెను. ౧) దుర్గా దేవి, ౨) శ్రీ మహా లక్ష్మీ

౩) సరస్వతీ దేవి ౪) సావిత్రి దేవి ౫) రాధా దేవి. 

కర్పూర గౌరం కరుణావతారం, సంసార తారం భుజగేంద్ర హారం
సదా వసంతం హృదయార వింద౦, భవం భవానీ సహితం నమామి.
భవం భవానీ సహితం నమామి, భవం భవానీ సహితం నమామి.
మీ 

భాస్కరానంద నాధ/ 9-10-2012

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.