Monday 31 December 2012

మంత్రము – మాతృకలు


01. మంత్రము – మాతృకలు

ఈ సృష్టి అంతా నాద బ్రహ్మమయం. సర్వము అక్షరాత్మకము, వైఖరి శబ్ద బ్రహ్మమయము.  శబ్దమే బ్రహ్మము. నాదమే బ్రహ్మము.   అక్షరములు అచ్చులు, హల్లులు పరమ శివుని చే అనుగ్రహింప బడినవి. ఒక్కో వర్ణము ఒక్కో దేవతను, తత్వమును సూచించును. కావున అక్షరములన్నియు మంత్రము లగుచున్నవి. అందుకే ఆ సర్వమంగళ మాతృకావర్ణ రూపిణి అయినది.                సర్వ వర్ణములలో మొట్ట మొదటి అక్షరము అయిన “అకారము” శివుడు, ప్రకాశము. అంత్యాక్షరమైన “హకారము”    శక్తి, విమర్శము.  వీని సామరస్యమే “అహం”. అచ్చులు శక్తి రూపములు. హల్లులు శివ రూపములు. ఓం కారము నుండి సకల వర్ణములు ఉత్పన్నము లైనవని వేదములు, పురాణములు ఘోషించు చున్నవి.  ఓం ధ్వని పరబ్రహ్మము. మూలాధారాది షట్చక్రముల తాకిడిచే వర్ణముల ఉత్పత్తి గల్గును అని తంత్రములు చెప్పుచున్నవి. ప్రతి శబ్దమునకు ఒక్కో అర్ధము కలదని, శక్తి, ఈశ్వర తత్వముల కలయక నుండి ధ్వని పుట్టు చున్నదని మంత్ర శాస్త్రములు చెప్పు చున్నవి.  అకారాది హకారాంతము వరకు గల ఏబది వర్ణములు మాతృకా వర్ణములు.

మననము చేయుట వలన రక్షించునది మంత్రము. అనగా దేవతాథిష్టిత వర్ణములు మననముచే ఆ దేవత మానసిక శక్తిని ప్రేరేపించును. పిదప సాధన చే ఆ దేవతను సాధించును. మంత్రము ఒకానొక దేవతా స్వరూపము. సాధనా శక్తిచే మంత్ర శక్తి ప్రస్పుట మగును. పరదేవత వర్ణమాలాధారిణి. వర్ణముల సంఖ్యను బట్టి మంత్ర నామము వేరగుచుండును.

అకారాది, క్షకారాంతములు అంటే అ నుంచి క్ష వరకు గల వర్ణములను మాతృకలు అని అందురు. అ .. క్ష  కలయకే అక్షరములు.  సనత్కుమార సంహితలో వర్ణములకు రంగులు చెప్ప బడినవి. అకారాదులు ధూమ్ర వర్ణములు, కకారాదులు సింధూర వర్ణములు, డకారము మొదలు ఫ కారము వరకు ...గౌర వర్ణములు,  వ కారము మొదలు అయిదు అరుణ వర్ణములు, ల కారాదులు బంగారు వన్నె గలవి, హ కార, క్ష కారములు ... మెరుపుతో సాటియైనవని చెప్ప బడినది. ఈ విధముగా దేవి అక్షర రూపిణి, మాతృకా వర్ణ రూపిణి అయి, శబ్ద బ్రహ్మ స్వరూపిణిగా, శబ్దాతీతగా పిలువ బడుచున్నది. ఈ మాతృకా వర్ణములే శ్రీ చక్ర స్వరూపములు.

 బీజాక్షరములతో కూడియున్నవాటిని మంత్రములు అని అందురు. బీజములనగా ఒక మొక్కను సృష్టి చేయగల శక్తి గల విత్తనము అని అర్ధము. బీజాక్షరమనగా ఒక మంత్ర శక్తిని ఆవిర్భవింపచేయగల అక్షరమే బీజాక్షరము. అటువంటి బీజాక్షర సంపుటియే మంత్రము.  మంత్రాధీనంతు దైవతం ... అన్న ఆర్యోక్తి ననుసరించి దేవతలు మంత్రముల చేత ప్రసన్నులౌతారు. ఈ మంత్రము లన్నీ వేదముల నుండి ఆగమములనుండి ఆవిర్బవించినవే. ఈ మంత్రములను గురు ముఖతః స్వీకరించి సాధన చేయు విధానమే “ఉపాసన” అని అందురు. ఉపాసనకు మంత్రము అత్యంత ప్రధానము. ఒక్కో మంత్రమునకు ఒక్కో సంఖ్య నిర్దేశించ బడినది. ఆ సంఖ్యను దీక్షగా నియమానుసారముగా అనుష్టించిన, మంత్రము సిద్దించును.  మంత్రానుష్టాన యోగ్యత సిద్దించ వలెనన కనీసము లక్ష పర్యాయములు జపము చేసి, తద్ధా౦శ తర్పణ, హోమాదులు జరిపించవలెను. ....

శ్రీచక్రమునందలి ద్వితీయ భూపురమునందు, బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి,  వైష్ణవి, వారాహి, మాహేన్ద్రి, చాముండా, మహాలక్ష్మి. అనే అష్ట మాతృకలు కలవు.  ఈ అష్ట మాతృకలను ఉపాసించిన వానికి సకల విద్యలు వచ్చును అని వామకేశ్వర తంత్రము చెప్పు చున్నది.

సశేషం...

మీ

శ్రీ భాస్కరానంద నాథ / 01-01-2013.

మహావిద్యోపాసకులు, మహాపాదుకాంత శ్రీవిద్యాపూర్ణ దీక్షాపరులు.



 

 

 

 

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.