Wednesday 14 May 2014

సౌందర్యలహరి- 11

సౌందర్యలహరి- 11

శ్లో|| చతుర్భి శ్శ్రీకణ్ఠై శ్శివయువతిభిః పఞ్చభిరపి
ప్రభిన్నాభి శ్శంభోర్నవభిరపి మూలప్రకృతిభిః |
చతుశ్చత్వారింశ ద్వసుదళ కలాశ్రత్రివలయ
త్రిరేఖాభి స్సార్ధం తవ శరణకోణాః పరిణతాః || 11

తల్లీ, భగవతీ! నలుగురు శ్రీకంఠులతోను (శివ చక్రాలు), ఐదుగురు శివశక్తులతోనూ (శక్తి చక్రాలు), మొత్తం తొమ్మిది మూల ప్రకృతులతోను,  అష్టదళం, షోడశదళం, మేఖలాత్రయం, భూపురం, అనే వాటితోను కూడి నీకు నివాసస్థానమైన శ్రీచక్రం యొక్క కోణాలు నలభై నాలుగు సంఖ్య గలవిగా పరిణమించి ఉన్నవి. (నాలుగు శివ చక్రాలతోనూ, ఐదు శక్తి చక్రాలతోనూ కూడి తొమ్మిది చక్రాలతో సొంపారు చున్నదని భావం).

శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.

భాస్కరానందనాథ  భావము:-
ఆచార్యుల వారు క్రిందటి శ్లోకములలో కుండలినీ శక్తిని గురించి చక్కగా మనకు వివరించి యున్నారు. సూక్ష్మ రూపములో తల్లిని ఎలా ఆరాధన చేయాలి అనేది కూడా మనకు తెలిపినారు. ఇప్పుడు మనకు సూక్ష్మ ఆరాధన క్రింద అసలు శ్రీచక్రము అంటే ఏమిటి? దానిలో ఏమున్నది, దాని నిర్మాణము ఏమిటి ? దానిలో దాగి వున్న రహస్యము ఏమిటి అనేది మనకు చక్కగా వివరిస్తున్నారు ఈ శ్లోకములో. అత్యంత విలువైన శ్లోకము ఇది. Geometrical view ను సూత్రములతో సహా  సిద్ధాంతీకరిస్తున్నారు గురు దేవుళ్ళు. లలితా సహస్ర నామములను  చదివితే ఆ శబ్ద తరంగములకు  శ్రీచక్ర రేఖా చిత్రము వస్తుందని రుజువు కూడా చేయడమైనది. అటువంటి శ్రీ యంత్రము గురించి మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. ఎందరెందరో మహానుభావులు ఈ శ్రీచక్రమును గురించి కొన్ని వందల పుస్తకములు వ్రాసివున్నారు, ఇంకా వ్రాస్తూనే వున్నారు. అందరికీ మూలం సౌందర్య లహరి మరియు తంత్ర శాస్త్రములు.

ఆది గురువులు పెట్టిన బిక్ష ఇది మనకు, వారె విరచించి స్తోత్రము చేయక పోతే ఈనాడు మనము ఆది మానవులము గా, అజ్ఞానులుగా మిగిలి పోయి వుండే వాళ్ళము. ఈ జ్ఞాన వీచికలు వీయవు, ఆ సౌగంధిక సౌరభాలు దొరకవు ఈ ఆనందం ఉండదు.  మనశ్శాంతి ఉండదు. గురుదేవుల్లకు ఎంతో రుణపడి వున్నాము. లేదంటే వామాచార పద్దతిలో అవైదిక మార్గములో అంతా సర్వ నాశనం అయ్యి వుండేది. ఒకరికొకరు పీక్కొని చచ్చి వుండే వాళ్లము. తంత్ర గ్రంధము లన్నీ వారు పరిష్కరించి మనకు నూతన మార్గము చూపిస్తూ నాగరికత నేర్పిన మహానుభావులు వారు, ఎన్నో గ్రంథములకు వారు భాష్యములు వ్రాసి భావార్ధము లను విడమర్చి చెప్పిన  అపర శంకరులు, శ్రీ దక్షిణామూర్తి అవతారం శంకర భగవత్పాదులు.

ప్రతి శ్లోకములో వారు స్థూల, సూక్ష్మ, పరార్ధములు చెప్పి యున్నారు. వారి యొక్క మనో భావాన్ని పట్టుకొంటే చాలు మనకు అర్ధం అయ్యినట్లే.   మూలం అర్ధం అయితే చాలు, మనము సాధన చేయ వచ్చును.
ప్రతి పదాన్ని ఎంతో దూరం ఆలోచించి వారు వేసినారు. ఆ పదం అక్కడే ఎందుకు వేయాలి, మరొకటి ఎందుకు వేయకూడదు  అని దీర్ఘంగా ఆలోచిస్తే, ప్రతి పదం వెనుక పరిగెడితే  పద లహరి అయిన సౌందర్య లహరి అర్ధమైనట్లే,  అమ్మ వారి దర్శనం పొందినట్లే.  

అక్షర సముదాయమే వాక్యము. ఆ అక్షరములే మాతృకలు. మాతృకలు దేవీ స్వరూపములు. అ నుంచి క్ష వరకు గల వర్ణములు  అక్షరములు.  శక్తి స్వరూపములు. అక్షరములలో ప్రాణ శక్తి గలదు. ఐ...ఐ ..ఐ అని కొలచిన ఒక మూగ బాలుడికి అమ్మ ప్రత్యక్షమైనది. ఒక్కో అక్షరములో ఒక్కో జీవ శక్తి గలదు. ఏ మంత్రమూ, తంత్రము పల్లేదు వూరికే   క..క..క అని జపిస్తూ వుంటే చాలు మహా శక్తి ఉద్భవిస్తుంది.   ఈం...ఈం అని పలుకరిస్తూ వుంటే చాలు జీవ శక్తి పుట్టుకొస్తుంది.   మ...మ..మ.. అంటూ వుంటే చాలు పరమ శివుడు ప్రత్యక్ష మౌతాడు.
మన సనాతన ధర్మములో ఒక్క శబ్దము చాలు తరించడానికి. పాప పుణ్యములతో ముడిపెట్టి మనిషిని సంస్కరించినాయి వేదములు. లేదంటే ఏ చట్టములు, న్యాయములు మనల్ని కాపాడలేవు. మన సంస్కృతి యొక్క ధర్మమే మనకు శ్రీరామ రక్ష. ఎవడికి వాడే ధర్మ చట్రాన్ని తనకు తానుగా బిగించుకొని తాళాలు వేసుకొని, హద్దులల్లో వుండి జీవన యాత్ర కోన సాగిస్తున్నాడు. లేదంటే అందరూ జంతువులుగా వ్యవహరించి వుండేవాళ్ళు. అటువంటి చక్కటి మార్గాన్ని నిర్దేశించిన మన ఋషి పుంగవులకు, ఆచార్యులకు, గురువులకు మనము ఎంతో రుణ పడి ఉన్నాము.  తస్మే శ్రీ గురవే నమః

అమ్మను చూడటానికి, పట్టుకోవడానికి  సౌందర్య లహరి.
లేకపోతే అది లహరి కాదు ఉత్త సౌందర్యం, ఒక కాంత సౌందర్యం.
భావమును పట్టుకోండి భావము వెనుక భవానీ వచ్చేస్తుంది. భవానీ భావనాగమ్యా....అని అన్నారు కదా!
 పెద్దలు చెప్పినది అదే, నేను ఆచరిస్తున్నది కూడా అదే. శంకరులు ఆ పరమ శివుని యొక్క భావమును పట్టుకొని శ్రీచక్రము గురించి ఈ శ్లోకాన్ని రచించి స్తోత్రం చేసినారు, అమ్మ దర్శనం కలిగినది. ఇప్పుడు మనము ఆ  శంకరుల యొక్క భావమును పటుకొంటే ఆ తల్లి దర్శనం తప్పక లభిస్తుంది మన అందరికీ.

పరమేశ్వరుడు జగత్తునందలి ప్రాణుల కామ్య సిద్దుల కొరకు 64 తంత్రములను సృష్టించెను. కామేశ్వరీ దేవి కోరిక మేరకు చతుర్విధ పురుషార్ధములు ఒక్క మంత్ర, తంత్రము వలన లభించునట్లుగా శ్రీవిద్యా తంత్రమును, శ్రీచక్ర యంత్రమును ఆ పరమేశ్వరునిచే నిర్మింపబడినవి. ఈ తంత్రమునకు సిద్ద వజ్రమని, స్వతంత్ర తంత్రమని,  శ్రీచక్రము అన్ని మంత్ర, తంత్ర యంత్రములలో కెల్లా గొప్పదని సాక్షాత్తు ఆ కామకామేశ్వరుల ప్రతి రూపమని చెప్పుదురు. చక్రరాజము అని కూడా శ్రీచక్రమునకు పేరు.

శ్లో:   బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మ,
      మన్వశ్రదళ సంయుత షోడశారమ్,
      వృత్తత్రి భూపురయుతం పరితశ్చతుర్ద్వాః,
      శ్రీచక్రమేత దుదితం పరదేవతాయాః
బిందువు, త్రికోణము, అష్ట కోణము, దశ దళ యుగ్మము, చతుర్దశ దళము, అష్ట దళము, షోడశ దళము, త్రివలయుము, భూపురము అను వానితో  గూడి, నాలుగు ద్వారములు గలదై ఆ పర దేవతయే శ్రీచక్ర స్వరూపమై  వెలసియున్నది.

శ్లో:   చతుర్భి శ్శివచక్రైశ్చ శక్తి చక్రైశ్చ పంచభిః |
      నవ చక్రైశ్చ సంసిద్ధం శ్రీచక్రం శివయోర్వపుః ||......భైరవయామళము

శక్తి చక్రములు, 4 శివ చక్రములతో కూడి పరదేవతా స్వరూపమైన శ్రీ చక్రము ఏర్పడినది.
నవ యోనులనగా తొమ్మిది కోణములు, తొమ్మిది ధాతువులు. 
అయిదు ధాతువులు – శక్తి మూలకములు:-  చర్మము, రక్తము, మాంసము, మెదడు, ఎముకలు.
నాలుగు ధాతువులు – శివ మూలకములు:-  మజ్జ, వీర్యము, ప్రాణము, జీవము.
ఈ దేహము నవ యోనులతో బుట్టినదై  నవ ధాతు మయము అగు చున్నది. పదవ యోని బైన్ధవ స్థానము.
చరాచర స్వరూపమైన ఈ జగము శివ శక్తుల స్వరూపము. చరము అనగా పిండాండము, మన శరీరము. అచరము అనగా బ్రహ్మాండము అని అర్ధము. చరాచర స్వరూపమే శ్రీచక్రము.

ఈ అనంత సృష్టికి సూక్ష్మ రూపమే శ్రీచక్రము.   శివాశివుల శరీరమే శ్రీచక్రము.

చతుశ్చత్వారింశత్ అంటే శ్రీచక్రము లోని కోణాల సంఖ్య 44 అని. ఏ యంత్రము అయిన సరే ఈ శ్రీచక్రములో ఇమిడి పోవలసినదే. అంటే సర్వ యంత్రములు శ్రీచక్రములో వున్నవి. అందుకే శ్రీచక్రమును మాతృకాచక్రము అని అందురు.  ముక్కోటి దేవతలు శ్రీచక్రములో వున్నారు. పంచ ప్రేతాసీన అయినటువంటి ఆ తల్లి ముక్కోటి దేవతలకు తల్లి. త్రిమూర్తుల కంటే పూర్వము వున్నది. శక్తి రూపమై అందరిలో వున్నది.  సమస్త సృష్టి ఈ శ్రీ చక్రము నుంచే ఉద్భవించినది.  శ్రీచక్రమే ఈ సమస్త బ్రహ్మాండము.  ఈ అనంత సృష్టికి సూక్ష్మ రూపమే శ్రీచక్రము. 

సమస్త దేవతలకు, గురువులకు నిలయం ఈ శ్రీచక్రము.   సమస్త ప్రాణి కోటి ఈ శ్రీచక్రము నుంచే ఉత్పన్నమైనది.    అమ్మ అందరికీ అతీతంగా అందరికంటే పైన శ్రీనగరములో వున్నది. ఒక్క శ్రీచక్రమును పూజిస్తే చాలు  సమస్త శక్తులను, దేవతలను, త్రిమూర్తులను పూజించినట్లే. అంబికా పంచాయతనం శ్రీచక్రములోనే వున్నది. శ్రీ చక్రము వున్న ఇంట్లో పంచాయతనం ఉన్నట్లే. సర్వ శక్తి మంతమైనది శ్రీచక్రము. శ్రీచక్రము వున్న ఇంట్లో సాక్షాత్తు అమ్మవారు నివసిస్తూ ఉన్నట్లే. ఎంతో భక్తితో, శ్రద్ధతో, మడితో శ్రీచక్రమును కొలవవలయును.  మహా పుణ్యము వుంటేగాని శ్రీచక్రమును కొలిచే అర్హత రాదు.  

బిందు స్థానమే సుధా సింధుః, కామకామేశ్వరుల నిలయం. శివ శక్తుల సమ్మేళన రూపం  బిందువు.       జీవ బ్రహ్మైశ్వరుల సమ్మైక్య రూపమే  బిందువు.   శ్రీచక్ర రాజ నిలయా శ్రీమత్త్రిపుర సుందరీ.  బిందువే త్రిపుర సుందరి, లలితాంబిక.

 మూడు కోణములు మూడు పురములు.  బ్రహ్మ, విష్ణు, రుద్రులే  త్రిపురములు.   త్రిపురాంతకుడు సదాశివుడు. అతని భార్య త్రిపుర సుందరి. అందుకే బిందువు క్రింద త్రికోణము గలదు.
మానవ దేహమే శ్రీచక్రము. సాధకుని దేహమే దేవాలయము. మానవ దేహము నవ రంద్రములతో కూడివున్నది.  శ్రీచక్రము తొమ్మిది చక్రముల సమూహము. శరీరములోని షట్చక్రములకు శ్రీచక్రములోని తొమ్మిది చక్రములకు అవినాభావ సంబంధము వున్నది. శరీరంలోని తొమ్మిది ధాతువులకు ఇవి ప్రతీకలు. శ్రీచక్రములోని తొమ్మిది చక్రములను తొమ్మిది ఆవరణములుగా చెప్పెదరు. నవావరణ పూజ అని ఈ తొమ్మిది చక్రములకు చేసెదరు.

శ్రీచక్రము మూడు రకములుగా లోకములో పూజింప బడుచున్నది.  ౧. మేరు ప్రస్తారము, ౨. కైలాస ప్రస్తారము,  ౩. భూ ప్రస్తారము.  సప్త కోటి మహా మంత్రములతో సర్వ దేవతా స్వరూపమైన శ్రీ చక్రమును పూజించిన యెడల సర్వ శక్తులు, జ్ఞానము, మోక్షము ప్రాప్తించునని పెద్దలు, ఋషులు చెప్పి యున్నారు.
శ్రీ చక్రము యొక్క నాలుగు ద్వారములు నాలుగు వేదాలకు ప్రతీకలు.
సర్వ మంత్ర స్వరూపిణి, సర్వ యంత్ర స్వరూపిణి, సర్వ తంత్ర  స్వరూపిణి... శ్రీచక్రము.

గూడార్ధము:-
శరీరమే శ్రీచక్రము.  స్థూల, సూక్ష్మ, కారణ దేహములు శరీర త్రయములు రధ త్రయములు.  బిందువు బ్రహ్మ రంద్రము. చిత్కలా రూపమే ఆత్మ.  ఇంద్రియములు అశ్వములు. మనస్సు మంత్రిణీ దేవి, బుద్ధి వారాహి దేవి..
బిందువు లోని ఆ పర దేవతను మానసికముగా పూజించ వలయును అని గురు దేవుళ్ళు చెప్పు చున్నారు.

44 కోణములతో, 44 తత్వములతో శివ శక్త్యైక్య రూపమై శ్రీచక్రము ప్రకాశించు చున్నది.

మహా వైశాఖి అయిన ఈ వైశాఖ పున్నమి లో ఆ జగదంబను చూస్తూ, పూజిస్తూ, కొలుస్తూ, తలుస్తూ, ఆ తిరుమల కోనేటి రాయుడికి  సమర్పించు కొంటున్నా ఈనాటి భావార్ధములు.

నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం,
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం.

సర్వం శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు.
భాస్కరామ్బా సహిత భాస్కరానంద నాథ.
(సరస్వతీ రామచంద్ర రావు)/14-05-2014 @ శ్రీకాళహస్తి
www.facebook.com/sribhaskaranandanatha/
http://vanadurga-mahavidya.blogspot.in/   






No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.