Thursday 11 September 2014

సౌందర్యలహరి - భాస్కర ప్రియ – 33

సౌందర్యలహరి -  భాస్కర ప్రియ 33

స్మరం యోనిం లక్ష్మీం త్రితయ మిద మాదౌ తవ మనోః
నిధాయైకే నిత్యే నిరవధి మహాభోగ రసికాః |
భజంతి త్వాం చింతామణి గుణనిబద్ధాక్షవలయాః
శివాగ్నౌ జుహ్వంతః సురభిఘృత ధారాహుతి శతైః || 33 ||

ఓ నిత్యస్వరూపిణి! నీ మంత్రానికి ముందు కామరాజ బీజం, భువనేశ్వరీ బీజం, లక్ష్మీబీజం కలిపి నిరవధిక మహాభోగరసికులు సకల సిరులను వాంఛిస్తూ చింతామనులనే రత్నాలతో కూర్పబడిన అక్షమాలలను చేతుల్లో ధరించి, కామధేనువు యొక్క నేతి ధారలతో శివాగ్నిలో అనేక ఆహుతులర్పిస్తూ, హోమం చేస్తూ, నిన్ను సేవిస్తూన్నారు.

శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.

భాస్కర ప్రియ” -  (భాస్కరానందనాథ  భావము)

ఈ శ్లోకములో జగద్గురువులు శ్రీ శంకర భగవత్పాదులు కామరాజ విద్యను  గురించి మనకు తెలియజేస్తున్నారు. మహా శక్తి వంతమైన మంత్రమును గురించి చెప్పు చున్నారు. బీజాక్షరములు గురువుల ద్వారా ఉపదేశము పొందవలెను. పరమాత్మతో ఆత్మ ఎలా అనుసంధానం కావలి అనే రహస్య యోగమును ఇక్కడ చెప్పుచున్నారు. ఈ యోగ ప్రక్రియను గురువుల ద్వారా పొందవలెను.

నీ పంచదశీ మంత్రానికి ముందు కామరాజ బీజం, భువనేశ్వరీ బీజం, లక్ష్మీబీజం కలిపి ఎవరు నిరవధికముగా జపిస్తారో వారు మహా భోగ రసికులు.
ఎవరు మహా భోగ రసికులు?
ఎడతెరగని, పరిమితి లేని అఖండమైన నిత్యమైన ఆనందానుభావము, నిరతిశయానందము పొందుతున్న పరమ యోగీశ్వరులు వారు మహా భోగ రసికులు.  అంతేగాని శరీర సంబంధము గలవారు కారు. అనుభవించునది భోగము అన్నారు. ఏమి అనుభవించుట? శరీరముతో అనుభవించునవి కావు. ఎందుకంటే శరీరము శాశ్వతము కాదు కాబట్టి ఆ సుఖములు తాత్కాలికములు. ఆత్మతో రమించునది అంటే ఆత్మ పరమాత్మతో రమించునది మహా భోగము అని అన్నారు. ఊర్ధ్వ ముఖమున అంటే సహస్రారమునందు కదలిక, చలనము ఏర్పడితే యోగము అన్నారు, అధో ముఖమున క్రింద భాగమున చలనము ఏర్పడితే భోగము అన్నారు. దీనినే మరో విధముగా ఊర్ధ్వ ముఖ స్కలనము, అధో ముఖ స్కలనము అంటారు. యోగులు భోగము లో కూడా యోగమునే చూతురు. జ్ఞానులైన యోగులు ప్రాపంచిక విషయముల కంటే కుండలినీ సాధన (యోగము) యందు,  ఊర్ధ్వ ముఖ చలనము నందు మిక్కిలి ఆశక్తిగా యుందురు.
భోగము అంటే అధిక సుఖము, అధిక ధనము  అనుభవించు  దానిని భోగము అందురు. మరి ఏది అధిక సుఖము? ఏది అధిక ధనము?
నిరంతర సుఖము, నిరంతర ధనము ను అంటే తరగని ధన,సుఖములను మహా భోగములు అని సమన్వయం చేసుకో వచ్చును.
అష్ట భోగములు అంటే గృహము, శయ్య, వస్త్రము, ఆభరణము, స్త్రీ, పుష్పము, గంధము, తాంబూలము.
వీటిల్లో గృహము, శయ్య, వస్త్రము అనేవి శరీరాన్ని సూచిస్తే, ఆభరణము, స్త్రీ, పుష్పము, గంధము, తాంబూలము మనస్సును సూచిస్తాయి. అంటే శరీరముతో అనుభవించేవి కొన్ని, మనస్సుతో అనుభవించేవి కొన్ని. చివరికి అన్నీ మనసుతోనే అనుభవిస్తాము. ప్రతి భోగాన్ని మనస్సు అనుభవిస్తుంది.  ఆ మనసుతో అనుభవించేవి శాశ్వతము అయితే అది యోగము, లేక పోతే భోగము. భోగము రోగాన్ని తెచ్చి పెడుతుంది. యోగము నిరతిశయానందమును తెచ్చి పెడుతుంది. భోగము వలన శరీరము అలసి పోతుంది. యోగము వలన ఆత్మ బలాన్ని, శక్తిని పొందుతుంది.
కాబట్టి నిరతిశయానందమును, బ్రహ్మానందమును  అనుభవించు వారిని మహాభోగ రసికులు అని అందురు.
దానిని సాధించుటకు మంత్రముతో అను సంధానము కావాలి, రమించాలి.  

శివాగ్ని అంటే శివా అంటే శక్తి అంటే త్రికోణము, దానియందు సంస్కరింప బడిన అగ్ని. త్రికోణ బైన్ధవ స్థానమున స్వాదిష్టాన అగ్ని ని తెచ్చి పై మంత్ర బీజాక్షరముల తో రగల్చ వలెను. కామరాజ కూటము అయిన ఈ మహామంత్రము మహాభోగ సాధనము. దీనినే అంతర్యాగము అని కూడా అందురు.
శ్లో|| మహాభోగా మహైశ్వర్యా మహావీర్యా మహాబలా |
      మహాబుద్ధి ర్మహాసిద్ధి ర్మహాయోగీశ్వరేశ్వరీ ||......
 అని బ్రహ్మాండ పురాణము లోని లలితా సహస్ర నామం యందు చెప్పబడి వున్నది.
ఇది మంత్ర శాస్త్రము నకు, యోగ ప్రక్రియకు  సంబంధించినది. మహాయాగానుసారము చేయు యోగులకు ఈ అభ్యాసము గురించి బాగుగా తెలుయును. ఇంత కంటే వ్యాఖ్యానము చేయుట తగదు ఇచ్చట.
ఈ శ్లోకము లోని ముఖ్య విషయములు ౧. మహా భోగ రసికులు, ౨. శివాగ్ని. వీటి గురించి పరిశీలించి, పరిశోధన చేయండి. రహస్యం దొరుకుతుంది.
ఈ పరిజ్ఞానమును ప్రసాదించిన ఆ మహా తల్లి పాద పద్మములకు నమస్కరిస్తూ,

నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం,
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం.

సర్వం శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు.
భాస్కరామ్బా సహిత భాస్కరానంద నాథ.
(సరస్వతీ రామచంద్ర రావు)/11-09-2014 @ శ్రీకాళహస్తి
www.facebook.com/bhaskarapriya.sowndaryalahari/
http://vanadurga-mahavidya.blogspot.in/