Sunday 30 August 2015

రామాయణం - కోపం

రామాయణం మనకు కోపాన్ని ఎలా నిగ్రహించుకోవాలో నేర్పుతుంది....విశ్వామిత్రునికి తపః శక్తి వున్నది...మరి ఆ తపః శక్తితో రాక్షసులను చంపడమో,  నశింపచేయడమో చేయవచ్చు గదా! ధశరథుని దగ్గరకు వచ్చి రాముణ్ణి పంపు అని ఎందుకు అడిగాడు..

శాపము ఇవ్వడం అన్నా, ఓక మనిషిని తిట్టడం అన్నా ఓకటే....తన పుణ్యఫలం, తపస్సు కరిగిపోతుంది.......రాక్షసుల మీద దేవతా ప్రయోగములు చేయాలి....దాని వలన తపః ఫలము నశించిపోతుంది. మరలా ఎన్నో సంవత్సరములు తపస్సు జేస్తేగాని శక్తి రాదు...పైగా రాక్షస సంహారం క్షత్రియ ధర్మం...రాజు ధర్మం...సంహరించడం బ్రాహ్మణ ధర్మం కాదు...అందుకని ఉపాసకులు ఇతరులు బాధించినప్పుడు సహించి ఓర్చుకొంటారు...తొందరపడి ఏమీ అనరు...

ఉపాసన చేయగా చేయగా అంతఃకరణం పవిత్రమై, శుద్ధి అయ్యి, సర్వమూ ఆ దేవతగానే దర్శిస్తాడు. తద్ధేవతగా మారుతాడు...తాను వేరు, తాను ఉపాసించే దేవత వేరు అనే భావన వుండదు...అన్ని రూపాలలో కనిపిస్తున్నది తను ఉపాసించిన దేవతే అనుకొంటాడు...అలాగే కనిపిస్తుంది. అటువంటి స్థితిని కల్పించడానికే మంత్ర తంత్రాలు వచ్చినాయి...మంత్రాలు జపిస్తూ తనను తాను మర్చిపోయి తద్దేవతలో కలిసిపోవడమే ఉపాసన...దానికే యోగమని పేరు....
అందుకని విశ్వామిత్రుడు రాముణ్ణి శరణుజొచ్చాడు తన యజ్ఞ నిర్వహణ కొరకు.....అందువల్ల మహర్షి తన కార్యానికి సహాయంగా రాములవారిని పంపవలసినదిగా దశరధ మహారాజుని కోరాడు.

రాముడు చేసిన మొదటి కార్యం ధర్మరక్షణార్ధమై తొలి అడుగు వేసినాడు....
యజ్ఞ రక్షార్ధి అయ్యి వేంచేసిన రాముల వారికి జయ మంగళం పలుకుతూ,
అటువంటి రాముడు మనలను రక్షించుగాక!
శ్రీరామ జయరామ జయ జయ రామా!

Sunday 17 May 2015

రావయ్యా....మా ఇంటి దాకా....

రావయ్యా! మా ఇంటిదాకా .....అన్నట్లు  కరుణాంతరంగడు ఆ శ్రీ వేంకటేశ్వరుడు శ్రీదేవీ భూదేవీ సమేతంగా నన్ను బ్రోవంగ మా ఇంటికి అరుదెంచిన వేళ... 15 సంవత్సరాల క్రితం......ఏలా వచ్చాడో తెలుసా? ఇవి చేయించిన విగ్రహాలు కాదు....షుమారు వంద సంవత్సరాల క్రితంవి అని కంసాలి వాళ్లు చెప్పి వున్నారు,  పూర్తిగా పంచలోహాలతో తయారు చేసినవి, ఏ మహానుభావుడు నిత్యం ధూపదీప నైవేద్యములతో అర్చన చేసిన బంగారు మూర్తులు, జీవ కళ అట్టే మూర్తీభవించినట్లుగా కనిపిస్తుంది ఇప్పటికీ....ఏమో నా అదృష్టమో, పుణ్యమో ...ఆ రోజు శివరాత్రి ....మా వూరికి దగ్గరలో కోవూరు తాలూకాలో గండవరం అని గ్రామం....గండవరంలో పెద్ద శివాలయం వున్నది....శివుణ్ని దర్శనం చేసుకొంటామని నేను నా భార్య మోటారు సైకిల్ లో వెళ్లాము....అమితమైన జనాలు వున్నారు.....నాకు జనాలు ఏక్కువగా వుంటే పడదు....ప్రశాంతత కావాలి.....గొప్ప చెప్పుకోవడం కాదు అమ్మకు నా మీద వున్న వాత్సల్యం అటువంటిది......నేను అలిగితే ఆమే చూడ లేదు....ఇది ప్రమాణ పూర్వకంగా చెబుతున్న మాటలు......ఏన్నో అనుభవాలు.....క్యూలో నిలబడి వేచి వుండలేక, అలిగి ....పోవమ్మా నీ దర్శనం కోసం ఇంతసేపు వుండాలా అని వచ్చేస్తుంటే ఫళని దేవాలయంలో,  ఏవరో బ్రాహ్మణుడు వచ్చి నేరుగా స్వామి గర్భగుడిలోకి తీసికెళ్ళి అభిషేకం దర్శనం చెయిపించినాడు....
అలాగే ఆనాడు గండవరంలోని శివాలయం లోని జనాలను చూసి అలిగి బయటకు వచ్చేసాము, ఇంటికి వెళ్ళిపోదామని తిరుగుముఖం పట్టాం. దారిలో అక్కడి ఇంకో పెద్ద దేవాలయం కనిపించింది ధ్వజస్తంభం తో....ఆగి లోపలకు వెళ్ళితే ఖాళీగా వుంది. అది రామాలయం....సరే ఇది ఖాళీగా ప్రశాంతంగా వుంది దీనిలోకి వెళ్లి స్వామి దర్శనం చేసుకొంటాము.....శివుడైతేనేమి?  రాముడైతేనేమి.....అని అన్నాను నా భార్యతో.....ఇప్పటిలాగే అప్పుడు కొళాయిలు లేవు.....కోనేరు వుండేది ప్రతి దేవాలయంలో....సరే కాళ్లు కడుగుకొని వస్తాము అని నేను నా భార్య కోనేరులోకి దిగాము......నా కాళ్లకు గట్టిగా ఏదో గుచ్చుకొన్నది......ఏమిటా అని చేతితో తడిమి చూస్తే చేతికి చిన్న మూట, చిన్న గుడ్డతో చేసిన సంచి లాంటి మూట తగిలింది....ముడి విప్పి చూస్తే బాగా పాచిపట్టిన మూడు చిన్న విగ్రహాలు......ఏదో కొయ్య బొమ్మలు లాగా వున్నాయి.....రామార్పణం అను కొని ఆ దేవాలయ అర్చకునికి చూపించాను......మహాప్రసాదం నాయినా ఆ రాముడు మిమ్ములను అనుగ్రహించినాడు.....లక్షణంగా తీసుకెళ్లండి అన్నాడు.....కోటి రూపాయలు దొరికేతే ఏంతటి ఆనందమో అంతటి మహదానందంతో ఇంటికి తిరిగి వచ్చి శుభ్రం చేసి చూస్తే అవి కొయ్య బొమ్మలు కాదు బాగా చిలుము పట్టిన పంచ లోహ విగ్రహాలు.....కంసాలికి చూపిస్తే వంద సంవత్సరాల పైనవి అని చెప్పాడు......ఇక ఆ రోజు రాత్రికి నిద్రలేదు.....నిమ్మకాయ...చింతపండు వేసి రుద్ది రుద్ది చేతులు నొప్పి పుట్టినాయి......అలసిపోయి ఆ మూర్తులను చింతపండు పులుసులో నానబెట్టినాము......తెల్లవారి లేచి గిన్నేలో నుంచి తీసి చూస్తే........ఆహా జగదభిరాముడు సీతా లక్షమణులతో మా ఇంటికి వచ్చారా అన్నట్లు దేదీప్యమానంగా వెలిగిపోతూ శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ వేంకటేశ్వరుడు, శ్రీమణ్నారాయుడు కనిపించినాడు.......కదలెను కోదండపాణీ....అన్నట్లుగా కాసేపు రాముడిగా, కాసేపు నారాయడిగా, కాసేపు శ్రీవేంకటేశ్వరస్వామి గా ఆహా ఏమి దర్శనం గావించినాడో! మాటలు లేవు.....నేను నా భార్య ఏడ్చి ఏడ్చి.....ఆనందాన్ని తట్టుకోలేక మా బంధువులకు చెబితే మమల్ని పిచ్చి వాళ్ళుగా చూశారు...అంతే అప్పటి నుంచి ఈ రహస్యాన్ని ఏవ్వరికీ చెప్పలేదు....15 సంత్సరాలు నిండిపోయినాయి....మా పీఠంలో కొలువుదీరిన శ్రీవేంకటేశ్వరుడు......మమ్మల్ని చల్లగా కాపాడుతూ అనుగ్రహిస్తూ వస్తున్నాడు....ఐదు అంగుళాల ఏత్తుతో ఇద్దరు తల్లులతో మా ఇంట్లో కూర్చుని దివ్య దర్శనం గావిస్తున్నాడు మాకు రోజూ.....ఏదో ఏమిటో ఈరోజు భక్తి పొంగుకు వచ్చి ఈ నిజాన్ని రహస్యాన్ని మీతో పంచుకొంటున్నాను ఆవేశంతో.......4,5  ఫోటోలోని దేవతామూర్తులు అవే శ్రీవేంకటేశ్వరస్వామి విగ్రహములు.....
కోదండరామా.....కోదండరామా.....మాంపాహి....కోదండరామా....

Saturday 11 April 2015

సౌందర్యలహరి -35 -  భాస్కర ప్రియ

సౌందర్యలహరి -35 -  భాస్కర ప్రియ

మనస్త్వం వ్యోమ త్వం మరుదసి మరుత్సారథిరసి
త్వమాపస్త్వం భూమిస్త్వయి పరిణతాయాం న హి పరమ్ |
త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా
చిదానందాకారం శివయువతి భావేన బిభృషే || 35 ||

ఓ శివుని ప్రియురాలా, మనస్సు నీవు, ఆకాశం నీవు, వాయువు నీవు, అగ్ని నీవు, జలం నీవు, భూమి నీవు. ఈ విధముగా పంచభూతములతో వ్యాపించిన, పరిణమించిన నీ కంటే వేరు ఏమియునూ లేదు. నీవే చిదానందకార రూపంలో చిచ్ఛక్తి వై శివ తత్వముతో ధరించు చున్నావు.

శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.

“భాస్కర ప్రియ” -  (భాస్కరానందనాథ  భావము)

ఈ శ్లోకములో జగద్గురువులు శ్రీ శంకర భగవత్పాదులు,  ఆనంద భైరవీ తత్వాన్ని,  చిచ్ఛక్తి స్వరూపాన్ని,   విశ్వ వ్యాపకత్వాన్ని   గురించి మనకు చక్కగా తెలియజేస్తున్నారు ఇక్కడ.

చిదానందాకారం శివయువతి భావేన బిభృషే
శివ యువతీ ...ఓ శివుని జవరాలా, శివుని చిదానంద స్వరూపాన్ని భావన చేత ధరిస్తున్నావు. అంతటా వ్యాపించి వున్న, అంతటా నిండి నిభిడీకృతమైయున్న  ఆనంద భైరవుని స్వరూపాన్ని,  చిచ్ఛక్తివి అయి నీ చిత్తము చేత ధరించి యున్నావు నీవు. అంటే అంతటా, అన్నింట్లో నీవు ప్రాణ శక్తివై యున్నావు.  నామ, రూప, క్రియాత్మకమగు ఈ ప్రపంచము నీవు.
విశ్వ వపుషా ....జగత్తు యొక్క రూపముతో పరిణామం చెందడానికి నీవై యున్నావు అంటే జగత్తు నీవై యున్నావు. ఎలాంటి జగత్తు ?.... ఆకాశం, వాయువు, అగ్ని, జలం, పృధ్వీ ...అనే పంచ భూతములతో ఆవరించి యున్న మహా ప్రకృతి వి నీవే. పరిణామం చెందే ఈ జగత్తు అంతా నీవే. పంచ భూతములతో, పంచ తత్వములతో ఈ ప్రపంచాన్ని, సృష్టిని కదుపుతున్న చిచ్ఛక్తివి నీవే. 
త్వమేవ అసి ......అది నీవే అయి వున్నావు తల్లీ ......పాపం ఆ పరమ శివుడిది ఏమీ లేదమ్మా, అల్లరి అంతా నీదే. ఆనంద స్వరూపిణివి నీవే. అఖిలాండేశ్వరి నీవే! చాముండేశ్వరివి నీవే !

త్వమర్కస్త్వ మిందు స్త్వమగ్ని స్త్వమాప 
స్త్వ మాకాశ భూ వాయవస్త్వం మహత్త్వమ్
త్వదన్యో న కశ్చి త్ప్రపంచోzస్తిసర్వం,
త్వ దానంద సంవిత్స్వ రూపాం భజేహమ్.........భవానీ భుజంగ స్తోత్రం

శరత్పూర్ణచంద్రప్రభాపూర్ణబింబాధరస్మేరవక్త్రారవిందాం సుశాంతాం
సురత్నావళీహారతాటంకశోభాం మహాసుప్రసన్నాం భజే శ్రీభవానీమ్ |
ఇతి శ్రీభవాని స్వరూపం తవేదం ప్రపంచాత్పరం చాతిసూక్ష్మం ప్రసన్నమ్
స్ఫురత్వంబ బింబస్య మే హృత్సరోజే సదా వాఙ్మయం సర్వతేజోమయం చ |

గురుస్త్వం శివస్త్వం చ శక్తిస్త్వమేవ త్వమేవాసి మాతా పితా చ త్వమేవ |
త్వమేవాసి విద్యా త్వమేవాసి బుద్ధిర్గతిర్మే మతిర్దేవి సర్వం త్వమేవ || ౧౪ ||

శరణ్యే వరేణ్యే సుకారుణ్యమూర్తే హిరణ్యోదరాద్యైరగణ్యే సుపుణ్యే |
భవారణ్యభీతేశ్చ మాం పాహి భద్రే నమస్తే నమస్తే నమస్తే భవాని || ౧౫

ఇతీమాం మహచ్ఛ్రీభవానీభుజంగం స్తుతిం యః పఠేద్భక్తియుక్తశ్చ తస్మై |
స్వకీయం పదం శాశ్వతం వేదసారం శ్రియం చాష్టసిద్ధిం భవానీ దదాతి || ౧౬ ||

భవానీ భవానీ భవానీ త్రివారం హ్యుదారం ముదా సర్వదా యే జపంతి |
న శోకం న మోహం న పాపం న భీతిః కదాచిత్కథంచిత్కుతశ్చిజ్జనానామ్ || ౧౭ ||

ఈ పరిజ్ఞానమును ప్రసాదించిన ఆ మహా తల్లి పాద పద్మములకు నమస్కరిస్తూ,

నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం,
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం. 

సర్వం శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు.
భాస్కరామ్బా సహిత భాస్కరానంద నాథ. 
(సరస్వతీ రామచంద్ర రావు)/05-04-2015 @ శ్రీకాళహస్తి
www.facebook.com/bhaskarapriya.sowndaryalahari/
http://vanadurga-mahavidya.blogspot.in/


Thursday 5 March 2015

సౌందర్యలహరి - భాస్కర ప్రియ – 34

సౌందర్యలహరి -  భాస్కర ప్రియ – 34

శరీరం త్వం శంభోః శశిమిహిరవక్షోరుహయుగం
తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘమ్ |
అతః శేషః శేషీత్యయముభయసాధారణతయా
స్థితః సంబంధో వాం సమరసపరానందపరయోః || ౩౪ ||

ఓ భగవతీ! నీవు శంభుడికి రవిచంద్రులు స్తనయుగంగాగల శరీర మవుతున్నావు. అమ్మా! నీ శరీరాన్ని దోషరహితమైన నవ ప్యూహాత్మకమైన ( కాల, కుల, నామ, జ్ఞాన, చిత్త, నాద, బిందు, కళా, జీవ తొమ్మిది ప్యూహాలు కలిగి ఉంటాడు కాబట్టి శంభుడికి నవాత్మ అని ఇంకో పేరు) ఆనందభైరవుడిగా తలుచుతాను. ఇందువల్ల ఈ శేష (సంబంధిత వస్తువు) శేషీ (మూల వస్తువు) భావ సంబంధం , సమసంబంధం కలిగి ఆనందభైరవ, ఆనందభైరవీ, రూప చిచ్ఛక్తులయిన మీ ఇరువురకు (శివశక్తులకు) సరిసమానంగా వుంది అని తలంతును. ఇరువురూ అవినాభావ సంబంధం కలిగి సమాన ప్రతిపత్తి కలవారని భావము.

శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.

“భాస్కర ప్రియ” -  (భాస్కరానందనాథ  భావము)

ఈ శ్లోకములో జగద్గురువులు శ్రీ శంకర భగవత్పాదులు పార్వతీ పరమేశ్వరుల గురించి మనకు తెలియజేస్తున్నారు. వారు ఒకరికొకరు శరీరమని, వారిది అర్ధనారీశ్వర తత్వమని, ఇద్దరికీ సమాన ప్రాధాన్యత వున్నదని, శేష శేషీ సంబంధము వున్నదని, వారి ఉభయ సంబంధముల గురించి మనకు చక్కగా తెలియజేస్తున్నారు ఇక్కడ.
శరీరం త్వం శంభోః శశిమిహిరవక్షోరుహయుగం
శరీరం త్వం శంభోః...... అమ్మా నీవు ఆ శంకరునికి శరీరం అగుచున్నావు తల్లీ. శంకరార్ధాంగ సౌందర్య శరీరాయై నమః అని లలితా అష్టోత్తరం శతనామావళి లో అమ్మకు పేరు. అలాగే శ్రీ కంఠార్ధ శరీరిణై నమః అని లలితా సహస్ర నామంలో అమ్మకు మరో పేరు కలదు. దీనిని బట్టి ఈశ్వరుని యొక్క శరీరం అమ్మ అని తెలుస్తున్నది. ప్రకాశ శివ శక్తి సమ్మేళన రూపమే బ్రహ్మాండ పిండాండ రూపములని, అదియే అర్ధ నారీశ్వర రూపమని, తత్వమని, అదియే శ్రీచక్ర స్వరూపమని తెలియనగును. శ్రీ అంటే విషము అని అర్ధము, విషమును కంఠమున కలిగిన వాడు శ్రీ కంఠుడు, శివుడు. అతనికి అర్ధ శరీరముగా గలది. అందుకే అమ్మకు, అయ్యకు తాదాత్మ్యము. అమ్మకు అయ్యకు భేదము లేదని,  కావున సృష్టి ఆదిలో ఒకటిగా వున్న ఆత్మ రెండుగా అయినది, అదే భార్యా భర్త లయినరి  అని బృహదారణ్యకము నందు తెలుప బడినది. అంటే ఆ మహా చైతన్యము అయిన పరమ శివుడు ఆత్మ అయితే, విశ్వస్వరూపిణి అయిన ఆ జగన్మాత ఆ శివుని ఆత్మకు   శరీరము అయినది. ఇదియే వాక్కు, అర్ధము అని, వాక్కులోనే అర్ధము వున్నదని వారే మన తల్లిదండ్రి అని మహాకవి కాళిదాసు ఇలా అన్నారు.
వాగర్ధా వివ సంపృక్తౌ, వాగర్దః ప్రతి పత్తయే, జగతః పితరౌ వందే, పార్వతీ పరమేశ్వరౌ ||

ఇదే విషయాన్ని శ్రీ గణపతి మునులు తమ ఉమా సహస్రం లో అత్భుతంగా వర్ణించినారు...
ఆరాధయసీశం తం చిన్మయకాయమ్, ఆనన్దమయాంఙ్గీ త్వం దేవి కిలేయమ్. ...౨౨
దివ్యం తవ కాయం దివ్యే తవ వస్త్రే, దివ్యాని తవామ్బా స్వర్ణాభరణాని ....(ఉమా సహస్రం-౨౩)
దేవి తన ఆనందమయమైన దేహమును పరమేశ్వరునికి ఇచ్చి, జ్ఞానమయ దేహము గల ఆ పరమేశ్వరుని ఆరాధించు చున్నది. అమ్మ శరీరము, వస్త్రములు, స్వర్ణాభరణములు ...అన్నీ దివ్యములే, అప్రాకృతములే. అమ్మ దేహము అలౌకికమైనది, తేజోమయమైనది  అది పరమేశ్వరునికి అంకితమైనది.
ఆత్మకు దేహము ఎంత ముఖ్యమో, శరీరమునకు వెన్నెముక, దానికి మహాశక్తి కుండలినీ కారణమగు చున్నది. అలా ఆ పరమ శివునికి అమ్మ సూర్య చంద్రులను వక్షోజముగా గల దేహము అగు చున్నది. సూర్య చంద్రులు వలన సృష్టి పోషింప బడుచున్నది. పోషకత్వానికి అమ్మ శరీరం ప్రతి రూపం.

అమ్మా, పరమేశ్వరుడు కేవలం సాక్షి మాత్రుడే, సృష్టి, స్థితి, లయములు నీవే గావించు చున్నావు. కాబట్టి నీవే శరీరము అగు చున్నావు ఆ శంభునికి.
సాక్షీ కేవల మీశః కర్తుం భర్తు ముతాహో, హర్తుం వాzఖిల మమ్భ, త్వం సాక్షాత్ ధృత దీక్షా....
(ఉమా సహస్రం , 6-22)
శ్రు || యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్టితః
       తస్య ప్రకృతి లీనస్య యః పర స్స మహేశ్వరః 
ఓం అనే ప్రణవము వైఖిరీ రూపము, పరమేశ్వరుడు, ప్రకృతి రూపమైన (అమ్మ) పరానాదమందు లీన మగుచున్నది. కాబట్టి ఆది శంకరులు  “శరీరం త్వం శంభోః......అని అన్నారు.
నీవేమో నవ చక్రాత్మకము, ఆయననేమో నవ వ్యూహాత్మకము. శివుడు నవాత్మకుడు, శక్తి నవాత్మిక .
ఆనంద భైరవుడైన, మహా భైరవుడైన శివున్ని కౌలులు నవాత్మడు అని అంటారు. ఆయన నవ వ్యూహాత్మకుడు కావడం వల్ల నవాత్ముడయ్యాడు.

శివ నవ వ్యూహాలు :- ౧. కాల వ్యూహము ౨. కుల వ్యూహము, ౩. నామ వ్యూహము, ౪. జ్ఞాన వ్యూహము, ౫.చిత్త వ్యూహము, ౬. నాద వ్యూహము, ౭. బిందు వ్యూహము, ౮ కళా వ్యూహము,  ౯. జీవ వ్యూహము.

నవ చక్రాత్మకము లు అయిన శక్తి నవాత్మకలు ...౧. వామా, ౨. జ్యేష్టా ,౩ రౌద్రా, ౪. అంబిక అనే నలుగురు అధోముఖ శివ చక్రములు చతుర్యోని స్వరూపులై వుంటారు. అలాగే ౧. ఇచ్చా, ౨. క్రియా, ౩. జ్ఞాన, ౪ శాంతా ౫ పర అనే శక్తులు ఐదు శ్రీ చక్రములోని ఊర్ధ్వ ముఖ మైన శక్తి చక్రములుగా మొత్తం తొమ్మిది మంది నవ వ్యూహాత్మికలు. కాబట్టి భవతి కూడా నవాత్మిక అని తెలుసుకోవాలి.
ఈ విధముగా శేష శేషీ భావములతో శివుడు శక్తి ఆనంద భైరవుడు, మహా భైరవి అనే శివ శక్తులకు అవినాభావ సంబంధముతో తాదాత్మ్యము సిద్దించి నప్పుడు నవాత్మకత్వము ఇద్దరికీ సమానమే.
పార్వతీ పరమేశ్వరులు ఒకరికొకరు శరీరం అవుతున్నారు. శివుడు శరీరం అయితే దేవి అతనికి ఆత్మ, దేవి శరీరం అయితే శివుడు ఆమెకు ఆత్మ అవుతాడు. కాబట్టి శేష శేషీ సంబంధము ఉభయ సాధారణము. ఇద్దరూ జీవికాజీవులై వుంటారు.
అంటే అమ్మకు ప్రాణం అయ్య, అయ్యకు ప్రాణం అమ్మ అని తెలియ చెప్పుచున్నారు శంకరులు. ఒకరు లేనిదే ఇంకొకరు బ్రతక లేరు, అమ్మ అయ్య ల యొక్క అన్యోన్య దాంపత్యము గురించి, వారి వ్యూహాత్మిక శక్తులను గురించి చెప్పి ఇద్దరూ సమానమే అని చెప్పు చున్నారు. విడదీయరాని వారి అనుబందాన్ని గురించి మనకు చెబుతున్నారు.
ఈ పరిజ్ఞానమును ప్రసాదించిన ఆ మహా తల్లి పాద పద్మములకు నమస్కరిస్తూ,

నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం,
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం. 

సర్వం శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు.
భాస్కరామ్బా సహిత భాస్కరానంద నాథ.
(సరస్వతీ రామచంద్ర రావు)/02-02-2015 @ శ్రీకాళహస్తి
www.facebook.com/bhaskarapriya.sowndaryalahari/
http://vanadurga-mahavidya.blogspot.in/